రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఒక శాసనసభ సభ్యురాలు కూడా ఇదే విధంగా విప్‌ను ధిక్కరించారు. వీరిపై అనర్హత వేటు వేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ ప్రకారంగా విప్‌ను ధిక్కరించిన ఓటు వేసిన 16 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో తిరిగి వారంతా గెలుపొందుతారా లేదా అన్నది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్టీల విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్ శాససభ్యులు, ఒక ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం శాసనసభ్యుడు అనర్హతకు గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన తెలుగుదేశం శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామా వల్ల, ఓ సభ్యుడి మృతి వల్ల ఆరు స్థానాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. మొత్తం ఒకేసారి రాష్ట్రంలో 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
వీటిలో సీమాంధ్ర ప్రాంతంలోనే అత్యధిక స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఏడు స్థానాలు తెలంగాణకు సంబంధించినవి. తెలంగాణను వదిలేస్తే సీమాంధ్రలో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా అనర్హత వేటుకు గురయ్యే శాసనసభ్యులే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో కడప, పులివెందుల ఫలితాలనే పునరావృత్తం చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు.. మెజారిటీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెపుతున్నారు.
ఆ నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అంతేకాకుండా తన కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించిన వారిని తిరిగి సభకు పంపాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అలాగే, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటుతుందని అంటున్నారు. వైఎస్ జగన్ మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను మట్టి కరిపించాలనే కసితో ఉన్నారు. అయితే, జగన్ పార్టీ తరపున బరిలోకి దిగే కాంగ్రెస్ మాజీ సభ్యులు తిరిగి గెలుపొందుతారా లేదా అన్నదే ఇపుడు ప్రధాన చర్చగా ఉంది.
Tuesday, December 13, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment