Wednesday, December 7, 2011

నేటి యువతరం కూడా 'శ్రీరామ రాజ్యం' చూడాలి: బాలకృష్ణ...!

'ప్రజల్ని ధర్మమార్గంలో నడిపించే మహత్తర కావ్యం రామాయణం గురించి ఈ తరం వారు తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా వుంది. దర్శకుడు బాపు అద్భుత దృశ్య కావ్యంలా 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీరాముని పాత్రతో నా జన్మ ధన్యమైంది' అన్నారు బాలకృష్ణ. బాపు దర్శకత్వంలో రూపొందిన 'శ్రీరామరాజ్యం' ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'సినిమా అనేది కేవలం వినోద సాధనమే కాదు. సామాజిక పరివర్తనకు సినిమా దోహదం చేయాలి. శ్రీరాముడి పాత్రను పోషించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. విలువలతో కూడిన మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి 'శ్రీరామరాజ్యం' విజయం ఓ ఉదాహరణ. 

నేడు సమాజంలో ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు మృగ్యమయ్యాయి. మన సంస్కృతికి ఆలవాలమైన రామాయణ ప్రవచనాల్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడు సమాజంలో విలువలు ఫరిడవిల్లుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాల మూలాల గురించి యువతరానికి తెలియాల్సిన అవసరం వుంది. యువతరం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. బాపు, రమణలు 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని అద్భుత దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు. ఏనభై ఏడేళ్ల వయసులో కూడా బాబాయ్ నాగేశ్వరరావుగారు వాల్మీకి పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. ఆయన తప్ప మరెవ్వరూ ఈ పాత్రను చేయలేరు. నయనతార సీత పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అందరూ అపురూప చిత్రమని ముక్తకంఠంతో కొనియాడారు. ఇళయరాజా అందించిన సుమధుర బాణీలకు జొన్నవిత్తుల చక్కటి సాహిత్యాన్నందించారు' అన్నారు.

No comments:

Post a Comment