Wednesday, December 7, 2011

టన్నుల కొద్ది డబ్బుందని:జగన్‌ను కడిగి పారేసిన బొత్స

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జగన్ రాజకీయ లబ్ది కోసమే ఓదార్పు యాత్ర చేపడుతూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అవిశ్వాసంలో ప్రభుత్వ కార్యక్రమాలు వివరించగలిగామని, విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు ఎవరినీ ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. సభలో కరవుపై చర్చించేందుకు జగన్ ఎమ్మెల్యేలు ముందుకు రాలేదన్నారు. జగన్ ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

ప్రజాస్వామ్యంలో రాచరిక పాలన ఉండదని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. తాను సంతకాలు సేకరించానని చెబుతున్నారని అలా సేకరించినట్లయితే ఆ కుటుంబంపై తనకు గౌరవం ఉన్నట్లే కదా అని చెప్పారు. జగన్ డబ్బు, పేరు మరేదైనా చూసి కొందరు ఎమ్మెల్యేలు ఆయన వైపు వెళ్లవచ్చునన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని చెప్పారు. మాకు విలువలున్నాయి, మేం విలువలు దిగజారిపోయి బ్రతకడం లేదన్నారు. మనమొక్కరమే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఊదరగొట్టడం సరికాదని జగన్‌కు హితవు పలికారు. మేం కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చేయడం లేదన్నారు. జగన్ వద్ద టన్నుల కొద్ది డబ్బు ఉంది కాబట్టే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని చూశారని విమర్శించారు.

కాగా పాయకరావు ఎమ్మెల్యే బాబూరావు బెదిరింపులపైనా వివరణ ఇచ్చారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పడిపోతుందని పగటి కలలు కన్నారని విమర్శించారు. నేతల అవినీతి ఆరోపణలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

No comments:

Post a Comment